- పట్టభద్రులు 14,586, టీచర్లు 1561
- అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శన
ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పరిధి లోని టీచర్, పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. రెండు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు మూడు నెలల నుంచి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పించగా.. 2021 అక్టోబర్ 30 వరకు డిగ్రీ పూర్తి చేసిన పట్ట భద్రులు, ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు.
నవంబర్ 23న విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితాపై డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలు స్వీకరించిన ఎన్నికల సంఘం డిసెంబర్ 25 వరకు అభ్యంతరాలను పూర్తి చేసి సోమవారం తుది జాబితా విడుదల చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోవ్యాప్తంగా 14,586 మంది పట్ట భద్రులు, 1561 మంది టీచర్లు ఓటు నమోదు చేసుకున్నట్లు పేర్కొంది. పట్టభద్రుల్లో 10,104 పురుషులు, 4,482 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1561 టీచర్ల ఓటరు జాబితాలో పురుషులు 1073, మహిళలు 488 ఓటు నమోదు చేసుకున్నారు.
నవంబర్ 23న పట్ట భద్రుల ముసాయిదా జాబితాలో ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు 13,402 మంది నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత నెల రోజుల వ్యవ ధిలో కేవలం 1184 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. చాలా మందికి ఓటు నమోదుపై అవగాహన లేకపోవడంతో పాటు ఇటు అధికార యంత్రాంగం సైతం ఓటు నమోదు విషయంలో ప్రచారం చేయకపోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.